దేశవ్యాప్తంగా శనివారం దసరా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సీతమ్మకు ఎత్తుకెళ్లి రాములోరిని నానా తిప్పులు పెట్టిన రావణాసురుడి ప్రతిమలను పలు చోట్ల దహనం చేశారు. అయితే తాజాగా పలు ప్రాంతాల్లో ఇప్పుడు డేరాబాబా ప్రతిమలను తగలబెట్టారట! అదేంటి.. ప్రస్తుతం జైల్లో ఉన్న డేరా బాబాను ఎలా దహనం చేశారు అనేగా మీడౌట్! జనాలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు.
అయితే ఈ ఏడాది.. ఉగ్రవాదం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు – నిరుద్యోగం తదితర సమస్యలకు నిరసనగా ప్లకార్డులు తయారీ చేసి వాటిని రావణుడి బొమ్మకు తగిలించి దహనం చేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో దేశంలో పెరిగిపోయిన నకిలీ బాబాలపై ఇక్కడి జనాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు దసరా వేడుకలను ప్రధాన వేదికగా ఎంచుకున్నారు. డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ – ఆశారాం బాపుల ఫొటోలను రావణుడి స్థానంలో పెట్టి వాళ్లని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు రూపొందించి దహనం చేసేందుకు సిద్ధం చేశారు.
దీని గురించి పూణె లోక్మాన్య ఫెస్టివల్ నిర్వాహకులు మాట్లాడుతూ.. గత 20ఏళ్లుగా రావణ దహన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చెడు నశించాలని కోరుకుంటూ ఈ విధంగా చేస్తున్నట్లు నిర్వాహకుడు గణేశ్ తెలిపారు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కోసులో డేరా బాబా గుర్మీత్ 20ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి ప్రతిమలను తయారు చేసి దహనం చేశారు. నిజానికి ప్రజల్లో బలీయమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తాయి. దీనిని బట్టి 20 ఏళ్ల జైలు శిక్ష పడి ప్రస్తుతం కటకటాల్లో ఉన్న గుర్మీత్ పై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది.