ప్రిన్స్ మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్పైడర్ సినిమా భారీ అంచనాల మధ్య బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే భారీ అంచనాల నేపథ్యంలో స్పైడర్ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకెళుతూనే ఉంది.
ఈ చిత్రం కలెక్షన్లు శనివారం నాటికే రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసి, మహేష్ బాబు సినీ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు, ట్రేడ్ నిపుణుడు ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఇది ఫ్యాన్స్ కు పండగ చేసుకునే సమయమని అన్నాడు. బాక్సాఫీస్ వద్ద ‘స్పైడర్’ హిట్ అయిందని తెలిపాడు. దసరా పండగ సెలవు నాడు ‘స్పైడర్’ పుంజుకుని మరింత మందిని థియేటర్లకు రప్పించిందని అన్నాడు.
కాగా, ప్రీమియర్ షోల ద్వారానే మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న స్పైడర్, ఆదివారంతో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రూ. 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారన్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, చిత్రం కలెక్షన్లలో అధికభాగం విదేశాల నుంచే వస్తోందని మరో సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కన్నా, యూఎస్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచే అధిక వసూళ్లు వస్తున్నాయని, ఇంటర్నేషనల్ సినీ మార్కెట్ లో మహేష్ సత్తాను ;స్పైడర్’ మరింతగా పెంచిందని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.