భద్రాచలం ఆలయానికున్న ప్రాశస్త్ర్యం, ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామ చంద్రుడికున్న ఆదరణ దృష్ట్యా భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే ఓ అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో అధికారులతో భద్రాచలం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం…ఆలయ అభివృద్ధి ఖర్చు కోసం ఏమాత్రం వెనుకాడొద్దని సూచించారు.
గతంలో రూపొందించిన ఆలయ అభివృద్ధి నమూనాలకు శ్రీత్రిదండి చినజీయర్ స్వామి స్వల్ప మార్పులు సూచించారు. ఈ మార్పుల అనంతరం ఆర్కిటెక్ ఆనందసాయి నూతన డిజైన్‌ను సీఎం ముందుంచి వివరించారు. దేవాలయ ప్రాంగణంలోనే కళ్యాణమండపం, షాపింగ్ కాంప్లెక్స్, భక్తులు సేద తీరే ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ప్రస్తుతమున్న దేవాలయంలోని గర్బగుడి, ఇతర ప్రధాన కట్టడాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇతర నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు.
సీతారమ కళ్యాణం సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న సీఎం..రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏమాత్రం ఇబ్బంది కలగకుండా భగవంతుడి దర్శనం, గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడానికి ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. గోదావరి నదిపై ప్రస్తుతమున్న బ్రిడ్జితో పాటు మరో బ్రిడ్జిని నిర్మిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఆర్కిటెక్ ఆనందసాయి హాజరయ్యారు.