తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యం లో సెప్టెంబర్ ౩౦న “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా ” వేడుకల పోస్టర్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్ లో టాక్ ప్రతినిధులు రాజ్ కుమార్ శానబోయిన , సుభాష్ కుమార్ ఎంపీ కవిత ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తితో, ఈ సంవత్సరం టాక్ జరిపే వేడుకలను “చేనేత బతుకమ్మ” గా నిర్వహిస్తున్నామని, వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు.
చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ కవిత. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాలలో ఎంపీ కవిత ప్రోత్సాహం మరువలేమని ఇవాళ చేనేత బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించి మాలో నూతన ఉత్సాహాన్ని నింపిన ఆమెకు టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ఫోన్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది.
సెప్టెంబర్ ౩౦న ఉదయం 10 గంటల నుంచి వెస్ట్ లండన్ లోని ” ఐసల్ వర్త్ అండ్ సయాన్ స్కూల్” ఆడిటోరియం లో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయని ఆమె తెలిపింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టాక్ ప్రతినిధులు రాజ్ కుమార్, సుభాష్ కి మరియు జాగృతి నాయకుడు సంతోష్ రావు కొండపల్లి కృతఙ్ఞతలు తెలిపింది.