చాలకాలం తర్వాత కేంద్రకేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ప్రస్తుతం ఉన్నవారిలో 8 మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. మరికొంతమందికి శాఖల మార్పుతో సరిపెట్టనున్నట్లు సమాచారం.
కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఇప్పటికే ఐదుగురు మంత్రులు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో స్కిల్ డెవల్‌పమెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, జల వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్ రాజీనామాలను ఆమోదించారు. జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి ఆరోగ్య కారణాలు చూపి రాజీనామా చేస్తే.. పార్టీ ఆదేశాల మేరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఇంకా ఆమోదించాల్సి ఉంది.
కొత్తగా కేబినెట్‌లో అన్నాడీఎంకే, జేడీయూ పార్టీలకు రెండు చొప్పున మంత్రిపదవులు లభించే అవకాశం ఉంది. వీరితో పాటు త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్నవారిలో కొంతమందికి స్ధాన చలనం కల్పించడంతో సరిపెట్టనున్నారు మోడీ.
కేంద్రమంత్రిగా రాజీనామా చేస్తే నిర్మలా సీతారామన్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక ఏపీ నుంచి కొత్తగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.