తెలంగాణలోని అన్ని గ్రామాల్లో రైతులకు ఎలాంటి హాని జరుగకుండా.. అంతా పూర్తి పారదర్శకంగా భూ రికార్డుల ప్రక్షాళనం జరగాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, జేసీలు, ఆర్టీఓలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. భూమి రికార్డుల ప్రక్షాళన, సరళీకరణపై సీఎం అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఎకరాకు రెండు పంటల పెట్టుబడికి గాను ఏడాదికి రూ. 8వేలు పెట్టుబడి రైతుల బ్యాంకు అకౌంట్‌లో వేయాలని నిర్ణయించినం. రైతుల దగ్గర నుంచి వివిధ పనుల కోసం లక్షలాది ఎకరాల భూమి సేకరించినం. రైల్వే లైన్లు, ప్రాజెక్టులు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, ఆస్పత్రులు, కాలువలు నిర్మించడానికి వ్యవసాయ భూములు తీసుకున్నాం. కానీ ఈ వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదు. ఇంకా ఆ భూములు రైతుల వద్దే ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూముల విషయంలో స్పష్టత రావాలి.
భూమి రికార్డులు సరిగా లేకపోవడం అనేక వివాదాలు, ఘర్షణలకు దారి తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భూమి రికార్డులు ప్రక్షాళన చేయాలని సంకల్పించాం. వచ్చే మూడు నెలల్లో రెవెన్యూ అధికారులు భూమి రికార్డుల ప్రక్షాళన చేపట్టాలి. ఇప్పటి వరకు అధికారులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉండిపోయారు. రెవెన్యూ అధికారులు ప్రథమిక విదైన భూ నిర్వహణను నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది. రెవెన్యూ, వ్యవసాయ రికార్డుల్లో రైతుల భూముల వివరాలు వేర్వేరుగా ఉన్నాయి. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం వల్లే ఈ సమస్య తలెత్తింది. ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చి భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాలి. మొదటి దశలో వివాదం లేని భూముల విషయంలో స్పష్టత ఇవ్వాలి. రెండో దశలో కోర్టు వివాదంలోని భూములను గుర్తించాలి. కోర్టు తీర్పునకు లోబడి వాటిపై స్పష్టత ఇస్తాం. ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల వివరాలు నమోదు చేయాలని సూచించారు.
ప్రతి గ్రామంలో 80 నుంచి 90శాతం వరకు వివాదాలు లేని భూములు ఉన్నాయి. వాటిని రైతులు, గ్రామస్తుల సహకారంతో స్పష్టత ఇవ్వాలి. గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించే బృందాల ఎంపిక బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే. అవసరమైతే కొంత మందిని తాత్కాలిక పద్దతిలో నియమించుకోండి. రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి ప్రతి కలెక్టర్‌కు రూ.50 లక్షలు అందుబాటులో ఉంచుతున్నాం. గ్రామం యూనిట్‌గా వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వం సేకరించిన వ్యవసాయ భూముల వివరాలు సేకరించాలి. అన్ని రికార్డులు సమగ్రంగా నిర్వహించాలని సూచించారు.
భూరికార్డుల ప్రక్షాళనకు సంబంధించి కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో తమ అనుభవాలను రంగారెడ్డి, సిద్ధిపేట, ఖమ్మం కలెక్టర్లు, మిర్యాలగూడ ఆర్డీవో, భవనగిరి ఆర్డీవోలు సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీన్ని బట్టి 95శాతం భూములు వివాదరహిత భూముల్లున్నట్లు వెల్లడించారు.