నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభం కాగా, ఐదు రౌండ్లు ముగిసేసరికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం దాదాపు ఖరారైంది.
ఇప్పటివరకూ లెక్కింపు పూర్తయిన అన్ని రౌండ్లలో తెదేపా ఆధిక్యాన్ని కనబరిచింది. ప్రతి రౌండ్‌కు ఆధిక్యం పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. 17వ రౌండ్ పూర్తయ్యేసరికి వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై మొత్తం 27,366 ఓట్ల ఆధిక్యంలో తెదేపా ఉంది. మొత్తం 14 రౌండ్లు పూర్తయ్యేసరికి తెదేపాకు 75,843 ఓట్లు, వైకాపాకు 51,553 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 898 ఓట్లు వచ్చాయి.
కాగా..తొలి రౌండ్ నుంచే శిల్పాపై స్పష్టమైన ఆధిక్యంతో భూమా కొనసాగుతుండగా, ఫలితాల సరళి స్పష్టం కావడంతో తెలుగుదేశం కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి వైకాపా నేతలు ఒక్కొక్కరుగా నిష్క్రమించగా, టీడీపీ కార్యకర్తలు ఆనందంలో మునిగితేలారు.