అభిమానానికి ఎల్లలు లేవు:కేసీఆర్

186
KCR lay foundation for new Reddy Hostel
- Advertisement -

రెడ్డి హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్ధాపన చేయడం ఆనందంగా ఉందని…రాజా బహదూర్ వెంకటరామిరెడ్డిపై ఉన్న అభిమానికి ఎల్లలు లేవని సీఎం కేసీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బద్వేల్‌లో రెడ్డి హాస్టల్‌కు శంకుస్ధాపన చేసిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన సీఎం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.

పేద వారి సంక్షేమానికి పాటుపడిన గొప్ప వ్యక్తి వెంకటరామిరెడ్డి అని కొనియాడారు సీఎం. తాను స్ధాపించిన విద్యాసంస్థలతో రాష్ట్రంలో విద్యావ్యాప్తికి కృషిచేశారన్నారు. వెంకటరామిరెడ్డికి కులం,మతం అపాదించలేమని పేదవారి కోసం నిరంతరం పరితపించే వారని రెడ్డి హాస్టల్‌లో ఇతర కులస్థులకు కూడా చదువుకునే అవకాశం కల్పించారని చెప్పారు. సమాజ పురోగతికి కంకణబద్దులై పనిచేశారన్నారు. అంచెలంచెలుగా ఎదిగి కొత్వాల్ పదవిని అలంకరించారని గుర్తుచేశారు.

14 విద్యాసంస్ధలు ఏర్పాటుచేసి మహిళలకు విద్యను అందించారని చెప్పారు. రెడ్డి హాస్టల్‌లో చదువుకున్న వారు ఎంతోమంది ఉన్నత స్ధానాల్లో ఉన్నారని తెలిపారు. రెడ్డి హాస్టల్‌కు తాను చేసిన సాయం చంద్రునికి నూలు పోగు వంటి సాయమన్నారు.రెడ్డి హాస్టల్‌కు 10 ఎకరాలతో మరో 5 ఎకరాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వెంకటరామిరెడ్డి పేరు చరిత్రలో చిరస్ధాయిగా ఉండాలని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు కేసీఆర్.

సమైక్య రాష్ట్రంలో ప్రముఖుల పేర్లు కనుమరుగయ్యాయని తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్ర పోలీస్ శాఖ అప్పాకు రావు బహదూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీగా పేరు మార్చినట్లు తెలిపారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి జయశంకర్ సార్ పేరు పెట్టుకున్నామని చెప్పారు. అంబేద్కర్ కంటే ముందుగానే దళితుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని అలాంటి  వారి  పేర్లు చరిత్రలో కనిపించకుండా చేశారన్నారు.

- Advertisement -