గత మూడు నాలుగు రోజులుగా బీహార్ లో వరద బీభత్సం కొనసాగుతున్నది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఇంత వరకూ 120 మందికి పైగా మరణించినట్లు అధికారికంగా బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. కుండపోత వర్షాలకు వాగులూ, వంకలు పొంగి ప్రవహిస్తుండగా, ఓ వంతెనను దాటుతున్న కుటుంబం, వందలాది మంది చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీహార్‌లోని అరారియా ప్రాంతంలో రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ఉంది. పనుల నిమిత్తం వేరే గ్రామానికి వచ్చిన ప్రజలు తిరిగి వారి స్వంత గ్రామానికి ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నారు. అంతకుముందు కొంతమంది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పరుగులు పెట్టారు.
అప్పటికే వరద బీభత్సానికి ఆ బ్రిడ్జి 90 శాతం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. అయినప్పటికీ కొందరు బ్రిడ్జీని దాటుతూనే ఉన్నారు. అప్పటివరకు ఒక్కోక్కరూ బ్రిడ్జిని దాటుతున్నారు. ఈ సారి కుటుంబమంతా కలిసి దాటుతున్న వేళ బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో, వారంత క్షణాల్లో అదృశ్యమయ్యారు. వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వరదలో కొట్టుకుపోయిన వారి కోసం రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. కాగా బీహార్‌లో 16 జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని 16 జిల్లాలలోని 1,532 పంచాయతీలు గత నాలుగు రోజులుగా వరద ముంపులో మగ్గుతున్నాయని పేర్కొంది. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు,సైన్యం వరద సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి.