తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్దఎత్తున కొలువుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 9 నోటిఫికేషన్ల ద్వారా 2,345 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. వైద్యారోగ్యశాఖ, అటవీశాఖల్లో ఖాళీగా ఉన్న కొలువులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఉద్యోగాల విద్యార్హతలు, కొలువుల ఇతర వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆమె కోరారు.
ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపైనుంచి లక్షా 12వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు సీఎం కేసీఆర్. శాఖలవారీగా ఖాళీలు, భర్తీ చేసినవి, భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నవి, భర్తీ చేయబోతున్నవి పక్కా లెక్కలతో స్పష్టత ఇచ్చారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూనే మరో 12 వేలకు పైగానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు.ఇప్పటివరకు 27,660 ఉద్యోగాలు భర్తీ చేశామని, 36,806 ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతున్నవి, మరో 48,070 భర్తీకి సిద్ధంగా ఉన్నాయని సీఎం వివరించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాగుతున్న నియామకాల ప్రక్రియ తీరు తెన్నులను వివరించారు.