ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బీఆర్‌డీ ఆసుపత్రిలో ఇప్పటివరకు 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జరిగిన ప్రమాదంపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేని కారణంగా 30 మంది చిన్నారులు బలయ్యారు. ఇది విషాదం కాదు. నరమేధం. 70ఏళ్ల స్వాత్రంత్యం అంటే మన చిన్నారులకు చెప్పే అర్థం ఇదేనా..?’ అని ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు.
గోరఖ్‌పూర్ హాస్పటల్లో జరిగిన విషాదం పట్ల ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఆరోపించింది. గోరఖ్‌పూర్ నియోజకవర్గం ఆదిత్యనాథ్‌దే అని, ఈ ఘటన పట్ల సీఎం బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు గులామ్ నబీ ఆజాద్, రాజ్ బబ్బర్‌లు హాస్పటల్‌ను సందర్శించి చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడారు.
మరోవైపు గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్(బీఆర్‌డీ) ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి ఎటువంటి టెండర్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తామని మోడీ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. చిన్నారుల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ రౌతేలా చెప్పారు. నివేదిక అందాక కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.