సాధారణంగా అమ్మాయిలు జడను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అందంగా కనిపించడం కోసం వారికి ఇష్టం ఉన్నట్టుగా సెట్ చేయించుకుంటారు. కాస్త జుట్టు రాలిపోయినా విల విల లాడిపోతారు. అలాంటి మనస్తత్వం కలిగిన మహిళలను టార్గెట్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు తెలియకుండా జుట్టు కత్తిరిస్తున్నారు. చిన్నా , పెద్దా తేడా లేకుండా వెనకాల నుంచి వచ్చి జుట్టు కత్తిరించి పారిపోతున్నారట జడ సైకోగాళ్లు. ఇప్పటి వరకు 55 మంది మహిళల జడలను కత్తిరించేశారు.
తీవ్ర సంచలనంగా మారిన ఈ తరహా ఘటనలు రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. విచిత్రం ఏంటంటే జడలను కత్తిరించేవారు ఎవరికీ ఎలాంటి హానీ చేయడంలేదు. కొట్టడం కానీ, దొంగతనం చేయడం కానీ ఉండటం లేదు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అమ్మాయిలను స్కూళ్లకు కూడా పంపడం లేదు. భయం భయంగా ఉంటున్నారు. కొందరైతే దీన్ని మంత్రగాళ్ల పని అంటున్నారు. జడలో ఉన్న శక్తిని మంత్రగాళ్లు లాగేసుకున్నారు అని వాపోతున్నారు. అయితే పోలీసులు మాత్రం.. ఆకతాయిల పనిగా కొట్టేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో ఈ ఘటనలపై దర్యాప్తు చేయిస్తున్నారు.
అయితే కొంత మంది యువతులు ఈ తరహా ఘటనలకు చాలా భయపడుతున్నారట. ఏదో భూతం వచ్చి కత్తెరించిపోయిందని చెబుతున్నారట, అంతే కాకుండా మరి కొంతమంది చేతబడి చేయడానికి జుట్టు కత్తిరించుకొని పోయారని అనుక్షణం వణికిపోతున్నారు. స్థానిక జ్యోతిష్యులు, పండితుల సలహా మేరకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ్రామం చుట్టూ రక్షారేఖలను గీయిస్తున్నారు. అంటే జనాల్లో కత్తెర బ్యాచ్ ఏ రేంజ్ లో బయపెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.