గతేడాది టెలికాం రంగంలోకి ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఎంట్రీ ఇవ్వడంతో మిగతా నెట్‌వర్క్‌ల ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయ్. కాంపిటీషన్ తట్టుకుని తమ కస్టమర్లను కాపాడుకునేందుకు ఆయా నెట్‌వర్క్‌లు తమకు తగినట్లుగా ఆఫర్లతో హోరెత్తించాయి. ఆ తర్వాత మార్కెట్‌లో నిలదొక్కుకున్నాయి. ఎంట్రీతోనే జియో విపరీతమైన ప్రమోషనల్ ఆఫర్లు, ఉచిత 4జీ డేటా ఇచ్చినప్పటికీ 4జీ నెట్‌వర్క్ స్పీడ్‌లో మాత్రం ఎయిర్‌టెల్ ముందుందని ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ నివేదికలో వెల్లడైన సంగతి తెలిసిందే. తాజాగా ట్రాయ్ అందించిన నివేదిక ప్రకారం లయన్స్ వారి జియో నెట్‌వర్క్ అత్యంత వేగంగా 4జీ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.
జూన్ నెలలో జియో నెట్‌వర్క్ సెకనుకు 18 మెగాబిట్ల సరాసరి డౌన్‌లోడ్ స్పీడ్ అందించనట్లు… కేవలం 8.91 ఎంబీపీఎస్ సరాసరి డౌన్‌లోడ్ స్పీడ్‌తో భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ చివరి స్థానంలో నిలిచినట్టు నివేదికలో వెల్లడైంది. ఇక జియో తర్వాత రెండో స్థానంలో వొడాఫోన్ నిలిచింది. మూడో స్థానంలో ఐడియా, చివరి స్థానంలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. గత ఏడు నెలలుగా ట్రాయ్ సర్వేల్లో జియో మొదటిస్థానంలో నిలుస్తోంది. కానీ వొడాఫోన్‌తో పోల్చినపుడు జియో 68 శాతం మెరుగైన 4జీ సేవలు అందిస్తున్నట్లు ట్రాయ్ నివేదిక తెలిపింది. `మై స్పీడ్` యాప్ ద్వారా వినియోగదారుల నుంచి 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన వివరాలను ట్రాయ్ సేకరిస్తుంది. ఇక 3జీ స్పీడ్ విషయంలో వొడాఫోన్ మొదటిస్థానంలో నిలవగా, ఎయిర్‌టెల్, ఐడియా, ఎయిర్‌సెల్, బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.