అందరూ ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ముగిసింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలక వడ్డీ రేట్లపై పావు శాతం కోత విధించారు.
వీటి ప్రకారం.. రెపో రేటు నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో ప్రస్తుత రెపో రేటు 6.25 నుంచి 6.0శాతంగా ఉండనుంది. దీంతో బ్యాంక్ వడ్డీ రేట్లు కిందకు దిగొచ్చే చాన్స్ కనిపిస్తోంది. 10 నెలల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి.
అయితే గత ఏడేళ్లలో ఇదే కనిష్ఠ రెపోరేటు. రివర్స్ రెపో రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంకు రేట్లపై కూడా కోత విధించారు.
గత పాలసీ రేట్లు ఇలా ఉన్నాయి.
ఇక రెపో రేటు – 6.25శాతం
రివర్స్ రెపో రేటు – 6శాతం
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు – 6.50శాతం
బ్యాంక్ రేటు – 6.50శాతం
తాజా సమీక్ష నేపథ్యంలో ప్రస్తుతం పాలసీ రేట్లు ఇలా ఉండనున్నాయి.
రెపో రేటు – 6శాతం
రివర్స్ రెపో రేటు – 5.75శాతం
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు – 6.25శాతం
బ్యాంక్ రేటు – 6.25శాతం
ఆర్‌బిఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల..పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో కుదేలైన పారిశ్రామిక రంగానికి ఈ వడ్డీ రేట్ల తగ్గింపు ఊరటనిస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.