నాగచైతన్య, సమంతల పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నాయి. అక్టోబర్ ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ వీరి వివాహం జరగనుంది. అంతేకాదు ఈ పెళ్లిని రెండు సంప్రదాయాల ప్రకారం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట క్రిస్టియన్ పద్దతిలో చర్చిలో, తరువాత తెలుగు సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి కబుర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఆసక్తిని రేకెత్తిస్తున్న ఆ విశేషాల్లో ఒకటి పెళ్లి చీర విషయం. సమంత వంటి సినీతార పెళ్లి, అందునా ఆమె అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగుపెడుతోంది.. అంటే, వివాహం వస్త్రాల విషయంలో ఉండే గ్రాండ్ నెస్ ఏమిటో ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. పెళ్లి వేడుక సమయంలో సమంత కట్టుకోబోయే చీర గురించి ఆసక్తికరమైన మాట వినిపిస్తోంది. అదేమిటంటే.. సమంత పెళ్లి బట్టలను ప్రముఖ డిజైనర్ క్రిషా బజాజ్ డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. వివాహ సమయంలో సమంత కట్టుకోబోయే చీర నాగచైతన్య అమ్మమ్మ గారిది అన్న ప్రచారం జరుగుతోంది. అంటే మూవీ మొఘల్ డి రామానాయుడు భార్య రాజేశ్వరి దేవి చీరను సమంత పెళ్లి కోసం కట్టుకుంటోందట.
ఈ చీరను క్రిషా తనదైన స్టయిల్ లో మార్పులు చేస్తూ చీరపై బంగారు జరీ అంచు సొగసులు అద్దుతూ డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. సమంత అక్కినేని, దగ్గుపాటి కుటుంబాలకు చెందిన అలనాటి చీరను తన పెళ్లి చీరగా మార్చుకోవడంతో రెండు కుటుంబాలకు తన గౌరవం తెలిపే విధంగా, అలాగే సంప్రదాయానికి విలువిస్తున్నటు తెలుస్తుంది. అలాగే పెళ్లి నగలు కూడా ఓ ప్రముఖ జ్యూవెలరీ సంస్థ డిజైన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నగలు డైమండ్స్, కుందన్స్ తో తయారవుతున్నట్టు తెలుస్తుంది. సో చైతు సామ్ ల పెళ్లిలో రిచ్ నెస్ తో పాటు రెండు కుటుంబాల దర్పం కనిపించబోతుందన్నమాట. సో సామ్ పెళ్లి చీర చూడాలంటె అక్టోబర్ వరకు ఆగాల్సిందే.