సుమారు మైలు పొడవు తీరం… తీరం వెంబడి పెద్దపెద్ద బార్లూ రెస్టారెంట్లూ కొబ్బరిచెట్లూ… విశ్రాంతి తీసుకునేందుకు చూడచక్కని పూరిగుడిసెలు… రుచికరమైన సీఫుడ్… ఆరు బయట వాలు కుర్చీల్లో బీర్లు తాగుతూ.. ఇష్టమైన వంటకాలు తింటుంటే… వూహకందని ఫీలింగ్ కదా.. అందుకే దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో గోవాను భూతల స్వర్గంగా పేర్కోంటారు.. గోవా అందాలను తిలకించేందుకు వచ్చే స్వదేశీ, విదేశీ పర్యాటకులు క్యూ కడతారనడంలో సందేహం లేదు. ఇక పార్టీలంటే గోవాలోనే చేసుకోవాలంటూ తెగ ఎంజాయ్ చేస్తారు మందుబాబులు.. బీచ్‌ల్లో తిరుగుతూ తెగ తాగేస్తూ ఉంటారు.. తాజాగా మందు బాబుల స్వర్గంగా భావించే గోవాలో ఎక్కడ పడితే అక్కడ మందు తాగడం కుదరదంటూ గోవాలోని బీజేపీ ప్రభుత్వం టూరిస్టులకు పెద్ద షాకే ఇచ్చింది. గోవా ప్రభుత్వం మంగళవారం ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించింది.
ఇక నుంచి బీచుల్లో తాగితే అరెస్టులు కూడా చేయాలని నిర్ణయించింది. బీచ్‌లు శుభ్రంగా ఉండాలి. అక్కడ ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడరాదు. బీచుల్లో తాగుడుకు కూడా ఫుల్‌స్టాప్ పెట్టాం. అవసరమైతే అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడం అని గోవా టూరిజం మినిస్టర్ మనోహర్ ఆగావోంకర్ అసెంబ్లీకి తెలిపారు. ఇకపై బీచుల్లో తాగుతూ కనిపించిన వారిపై గతంలో పోలీసులు కేసులు కూడా నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్‌కు కొన్ని సవరణలు చేస్తున్నామని, పోలీసులకు మరిన్ని అధికారాలు ఇస్తున్నట్లు మనోహర్ తెలిపారు. బీచ్‌లతోపాటు పబ్లిక్ ప్లేస్‌లలో మందు తాగే వారిని అరెస్ట్ చేయాలని గత మే నెలలో పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.

