దయచేసి తనను రాజకీయాల్లోకి లాగొద్దంటూ విలక్షణ నటుడు కమల్ హాసన్ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా రాజకీయాలపై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన కమల్ ఇప్పుడు రూటు మార్చినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ వ్యాఖ్యలతో కమల్ తన ఫ్యాన్స్‌ను ఒకింత గందరగోళంలో పడేశారు. రీసెంట్ గా ఓ తమిళ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ.. ‘అవినీతికి వ్యతిరేకంగా మనసులోని భావాలను చెప్పడం నాకు అలవాటు.
అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలన గురించి ప్రజలకున్న అభిప్రాయాన్ని నేను చెప్పాను. దీన్ని పట్టుకుని నన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి లాగొద్దు’ అని కమల్ వివరించారు. స్వచ్ఛమైన పాలన రావాలన్న ఉద్దేశంతోనే అవినీతి గురించి మాట్లాడానని, అంతేకానీ ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వానికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
జయలలిత మరణాంతరం రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై ఇప్పటికే కమల్ పలు వ్యాఖ్యలు చేశారు. శశికళపై కూడా గతంలో కమల్ విరుచుకుపడ్డారు. ‘మేం రాజకీయాల్లోకి వస్తే తమ వెంట గన్స్ కూడా తీసుకెళ్తామని’ శశికళకు వార్నింగ్ ఇస్తూ పన్నీర్ సెల్వంకు తన మద్దతు తెలిపారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కూడా కమల్ గతంలో స్పందించారు. ఇక తాజాగా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందంటూ కమల్ చేసిన ఘాటు వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
కమల్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు ఎదురు దాడికి దిగారు. కమల్ అభిమానులు కూడా మంత్రులపై మాటల దాడులు మొదలుపెట్టారు. దీంతో కమల్ రాజకీయ రంగప్రవేశం ఖాయమంటూ తమిళనాట ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోతన నిర్ణయాన్ని స్పష్టం చేశారు కమల్.