SP: కాంగ్రెస్‌కు 55 స్థానాలే!

3
- Advertisement -

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. పొత్తులో భాగంగా తమకు 100కు పైగా అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ డిమాండ్‌కు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించడం అంత సులభం కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు ఢిల్లీలో సమావేశం కాగా రెండో సమావేశం వచ్చే మంగళవారం జరగనుంది.

ప్రస్తుతానికి సీట్ల సంఖ్యపై తుది చర్చ జరగదని, తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల జాబితాను సమాజ్‌వాదీ పార్టీ ముందు ఉంచడమే ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా స్థానాల్లో గెలుపు అవకాశాలు, ఎన్నికల వ్యూహాలను కాంగ్రెస్ వివరించాలని ఎస్పీ కోరనున్నట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిలో 100కు పైగా స్థానాలు కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా పొత్తులో భాగంగా తమకు 55 నుంచి 60 వరకు బలమైన స్థానాలు (ఏ-గ్రేడ్ సీట్లు) దక్కాలని కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ బలంగా ఉన్న 40 నుంచి 45 స్థానాలను కాంగ్రెస్‌కు కేటాయించే ప్రతిపాదనను సమాజ్‌వాదీ పార్టీ ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించిన లేదా స్వల్ప ఓట్ల తేడాతో వెనుకబడిన అసెంబ్లీ స్థానాలపై ఆ పార్టీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దళితులు, ముస్లింలు, బ్రాహ్మణుల ఓటు బ్యాంకును ఆకర్షించే అవకాశం ఉన్న నియోజకవర్గాలను కూడా కోరుతోంది.

Also Read;బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఎందుకు?

2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు సుమారు 105 స్థానాలను కేటాయించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి 100 సీట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలకు గాను కాంగ్రెస్ 17 స్థానాల్లో ఎస్పీతో కలిసి పోటీ చేసింది. ఇదే ఫార్ములా ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో 85కు పైగా స్థానాలు తమకు రావాలని కాంగ్రెస్ వాదిస్తోంది.

సీట్ల సంఖ్య కంటే గెలుపు అవకాశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో కాంగ్రెస్‌కు సుమారు 55 స్థానాలను కేటాయించే ప్రతిపాదనను సమాజ్‌వాదీ పార్టీ పంపినట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.

సీట్ల పంపకాల చర్చల్లో సహరాన్‌పూర్ దేహత్, బెహట్, అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలు కీలకంగా మారే అవకాశముంది. గత ఎన్నికల్లో ఈ స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకుంది. అయితే సహరాన్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ నేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ ఈ ప్రాంతంలోని రెండు స్థానాలపై పట్టుబడుతున్నట్లు సమాచారం.మరోవైపు అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు గాంధీ కుటుంబానికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. కాంగ్రెస్ సమర్పించిన 181 స్థానాల జాబితాలో ఈ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -