ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం ఖాళీ:హరీష్‌

2
హరీష్ రావు
- Advertisement -

ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి హరీశ్ రావు ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్ నిర్వహించి రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షిస్తానని చెబుతున్నారని అయితే రాష్ట్రంలో రెండేళ్లుగా పరిశ్రమల శాఖకు కార్యదర్శి లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు. పరిశ్రమల శాఖకే సరైన అధికారి లేని పరిస్థితుల్లో కొత్త కంపెనీలను ఎలా ఆకర్షిస్తారని ప్రశ్నించారు.

గతంలో ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో ప్రచారం చేసినా రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని ఆరోపించారు. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఎన్ని? వాటిలో ఎన్ని పరిశ్రమలుగా కార్యరూపం దాల్చాయి? అనే వివరాలతో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉన్న హైదరాబాద్ నగరానికే తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలు సరిగా కల్పించలేని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని, మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కార్పొరేట్ పాఠశాలల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి కనీసం 16 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేశామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిలో నాలుగు లక్షల పింఛన్లను తగ్గించి, తిరిగి నాలుగు లక్షలు మంజూరు చేసి గొప్పలు చెప్పుకుంటోందని ఆరోపించారు.

Also Read:TTD:వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సొంతంగా సర్వేలు చేయించుకున్నా, వివిధ సంస్థలతో సర్వేలు చేయించినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే ఫలితాలు వస్తున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -