టీమిండియా స్టార్ బ్యాటర్, 2026 టీ20 ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ నుంచి మరోసారి నిరాశ ఎదురైంది. ప్రస్తుతం భారత జట్టు ఎంపిక ప్రణాళికల్లో సూర్యకుమార్ యాదవ్ లేడని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ప్రస్తుత భారత జట్టు కూర్పులో అతడికి చోటు లేదని స్పష్టం చేశాయి. దీంతో సూర్యకుమార్ అంతర్జాతీయ కెరీర్‌పై మరోసారి చర్చ మొదలైంది.
తాజాగా బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ మా సెలెక్షన్ ప్రణాళికల్లో లేడని పేర్కొన్నారు. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కే వైట్‌బాల్ క్రికెట్‌లో చోటు కల్పించలేకపోతున్నామని, అలాంటప్పుడు సూర్యకుమార్‌ను జట్టులోకి ఎలా తీసుకుంటామని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టులో అతడికి సరిపోయే స్థానం లేదని వెల్లడించారు.
మరోవైపు సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నవంబర్ 14న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే అజేయంగా 60 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. కేవలం 15 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేయడం విశేషం.
ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సూర్య తన విశ్వరూపం చూపించాడు. కేవలం 29 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. గోవాతో జరిగిన మరో మ్యాచ్‌లో 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు.
ALso Read:దేశంలో పెరిగిన మత్య్స సంపద
2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ అందించిన సూర్యకుమార్ యాదవ్‌కు ఆ తర్వాత అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సెలెక్టర్లు అతడిని టీ20 జట్టు నుంచి తప్పించారు. కెప్టెన్సీ బాధ్యతలను కూడా తొలగించి శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించారు.

