మూర్ఛ వ్యాధికి శస్త్రచికిత్సతో చెక్!

2
- Advertisement -

ఏళ్ల తరబడి వేధించిన మూర్ఛ వ్యాధి.. చివరకు శస్త్రచికిత్సతో విముక్తి. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం మందులు వాడాల్సిన అవసరం లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ముంబైకి చెందిన ఈ ఇద్దరి అనుభవాలు మూర్ఛ వ్యాధి చికిత్సలో శస్త్రచికిత్స ప్రాధాన్యతను మరోసారి చాటిచెబుతున్నాయి.

మెదడులోని నాడీ కణాల్లో అసాధారణ విద్యుత్ కార్యకలాపాలు చోటుచేసుకోవడం వల్ల మూర్ఛ వ్యాధి వస్తుంది. దీనివల్ల పదేపదే మూర్ఛ వస్తుంది. కొందరిలో శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోవడం, చేతులు, కాళ్లు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే.. మరికొందరిలో కొద్దిసేపు తదేకంగా చూడటం, కళ్లు ఆర్పడం, పెదవులు కదపడం, చేతులతో ఒకే రకమైన కదలికలు చేయడం వంటి స్వల్ప లక్షణాలు కనిపించవచ్చు.

భారత్‌లో సుమారు 1.2 కోట్ల మంది మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారని నిపుణులు వెల్లడించారు. సాధారణంగా చిన్నతనం, కౌమార దశలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని 60-70 ఏళ్ల వయసులోనూ మరోసారి ముప్పు పెరుగుతుందని వివరించారు. జన్యుపరమైన కారణాలు, పుట్టుకతోనే మెదడులో ఉండే అసాధారణ నిర్మాణాలు, ప్రసవ సమయంలో ఆక్సిజన్ కొరత, రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడం, క్షయ వంటి నాడీ వ్యవస్థ ఇన్ఫెక్షన్లు, మెదడులో కణితులు ఈ వ్యాధికి కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. స్ట్రోక్ వచ్చిన తర్వాత మెదడులో ఏర్పడే మచ్చల వల్ల కూడా కొందరిలో మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

మందులతో చాలామందిలో మూర్ఛ దాడులను నియంత్రించవచ్చు. అయితే ఏళ్ల తరబడి మందులు వాడుతున్నప్పటికీ తరచూ దాడులు వస్తున్నవారికి శస్త్రచికిత్స అవసరమా లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. ముఖ్యంగా మెదడులో సమస్యకు కారణమైన నిర్దిష్ట ప్రాంతాన్ని ఎంఆర్ఐ ద్వారా గుర్తించగలిగితే శస్త్రచికిత్సకు అర్హత ఉందో లేదో వైద్యులు అంచనా వేస్తారు.

దీనికోసం ఎంఆర్ఐ, వీడియో ఈఈజీ (EEG), న్యూరోసైకలాజికల్ పరీక్షలు నిర్వహిస్తారు. మూర్ఛ దాడులు మెదడులోని ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచే వస్తున్నాయని, ఆ ప్రాంతానికి సురక్షితంగా శస్త్రచికిత్స చేయవచ్చని నిర్ధారణ అయితే ఆపరేషన్‌కు సిఫార్సు చేస్తారు. మూర్ఛ వ్యాధికి కారణమైన అసాధారణ కణజాలాన్ని తొలగించే లెషనెక్టమీ (Lesionectomy), మెదడులోని టెంపోరల్ లోబ్‌లో కొంత భాగాన్ని తొలగించే టెంపోరల్ లోబెక్టమీ (Temporal Lobectomy) వంటి శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

Also Read:ఎల్‌నినో పరిస్థితులు..గ్లోబల్ సమ్మిట్ అవసరమా?

టెంపోరల్ లోబెక్టమీ ద్వారా సుమారు 70-80 శాతం మందిలో మూర్ఛ దాడులను నియంత్రించడంలో మంచి ఫలితాలు లభిస్తున్నాయి. అయితే శస్త్రచికిత్స చేసిన వెంటనే మందులు ఆపేయకూడదు. రోగి కోలుకునే విధానం, మూర్ఛ దాడుల నియంత్రణ ఆధారంగా వైద్యుల పర్యవేక్షణలో మందుల మోతాదును క్రమంగా తగ్గించాలి. ఆపరేషన్ తర్వాత కూడా రెగ్యులర్ వైద్య పరీక్షలు అవసరమవుతాయి.

- Advertisement -