గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (VMC) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు రూ.20 కోట్లకు పైగా విలువైన భూమిని కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. బీజేపీ పాలనలో ఉన్న వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లో సుమారు నాలుగు గంటల పాటు వాడీవేడిగా చర్చ జరిగిన అనంతరం మెజారిటీ సభ్యులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు.
ఈ భూమి మొత్తం మార్కెట్ విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే ఇందులో ఒక భాగాన్ని యూసుఫ్ పఠాన్‌కు ఉచితంగా బహుమతిగా ఇవ్వనుండగా మరో భాగాన్ని మార్కెట్ ధరలో సగం ధరకే విక్రయించనున్నారు. ఇందుకోసం ఆయన సుమారు రూ.5.52 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపల్ అధికారులు చెల్లించాల్సిన ఖచ్చితమైన మొత్తాన్ని యూసుఫ్ పఠాన్‌కు తెలియజేయనున్నారు. ఆ తర్వాత భూమికి సంబంధించిన విక్రయ ఒప్పందం (సేల్ డీడ్) నమోదు చేయనున్నారు.
అయితే ఈ భూమి కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలకు చెందిన విలువైన ఆస్తిని ఒక వ్యక్తికి ప్రత్యేక నిబంధనలతో కేటాయించడం సరికాదని విమర్శించింది. సాధారణ పౌరులకు అందుబాటులో లేని ప్రయోజనాలను యూసుఫ్ పఠాన్‌కు కల్పిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
Also Read:ఎల్‌నినో పరిస్థితులు..గ్లోబల్ సమ్మిట్ అవసరమా?
మరోవైపు ఈ భూమి డిస్టర్బ్డ్ ఏరియాస్ చట్టం పరిధిలోకి వస్తుంది. మతపరమైన అల్లర్లు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్థిరాస్తుల బదిలీకి జిల్లా అధికారుల అనుమతి తప్పనిసరి చేసే చట్టం ఇది. ఈ నేపథ్యంలో యూసుఫ్ పఠాన్‌కు భూమి కేటాయింపునకు ఈ చట్టం వర్తిస్తుందా లేదా అనే అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. దీంతో యూసుఫ్ పఠాన్‌కు భూమి కేటాయింపు వ్యవహారం గుజరాత్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

