అందరూ మెచ్చే..ఈ నగరానికి ఏమైంది రిపీట్!

2
- Advertisement -

ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్ల మీద సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాణంలో తరుణ్ బాస్కర్ దాస్యం తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా నవంబర్ 19న రాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘తరుణ్ తన మిత్రబృందంతో కలిసి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా చేశాడు. రెండో పార్ట్ చేయమని విశ్వక్ సేన్ అన్నాడు. రీ రిలీజ్ గురించి కూడా అతనే చెప్పాడు. రీ రిలీజ్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ టైటిల్ పోస్టర్ వచ్చినప్పటి నుంచే క్రేజ్, హైప్ పెరిగింది. ఆల్రెడీ సినిమా అద్బుతంగా ఉందని టీం చెప్పింది. టీంకు అడ్వాన్స్ కంగ్రాట్స్. తరుణ్ దర్శకుడిగా ఇలాంటి మంచి చిత్రాలు తీస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. కనీసం ఏడాదికి ఒక చిత్రమైనా తీయాలని ఆశిస్తున్నాను. సృజన్ క్యాబ్ నడుపుతూ స్కోరీ డిస్కషన్‌లో పాల్గొన్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను. ఈ చిత్రం మా ద్వారా రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో సృజన్, సందీప్‌కి లాభాలు రావాలి. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. ‘‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ మూవీని ఆల్రెడీ టీం అంతా కలిసి చూశాం. సింక్ సౌండ్ కాబట్టి.. డబ్బింగ్‌ ఉండదు, నేరుగా ఫైనల్ కాపీనే చూశాం. సినిమా చూశాక మాటలు రాలేదు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో ఒక్కొక్కరు ఒక్కో పాత్రకి కనెక్ట్ అవుతారు. రీ రిలీజ్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. పార్ట్ 2 తీయమని సురేష్ బాబు గారికి చెప్పాను. రీ రిలీజ్‌లో ఆడియెన్స్ ఇచ్చిన ప్రేమను చూసి ఈ సెకండ్ పార్ట్ చేయాలని తరుణ్ ఫిక్స్ అయ్యాడు. స్నేహం అనేది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. సినిమా కనిపెట్టి వంద ఏళ్లు అయిందని అనుకుంటే.. అన్ని బంధాల మీద సినిమాలు తీశారు. ఫ్రెండ్‌షిప్ కోసం సినిమా రావడానికి ఇన్నేళ్లు పట్టిందా? అని ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చూసి షాక్‌లో ఉండిపోయా. కచ్చితంగా ఈ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ని రీప్లేస్ చేస్తుంది. మూవీ చూసి బయటకు వెళ్లాక నన్ను వెంటాడింది. నా జీవితంలో ఇదొక బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. ఇందులో చాలా సర్ ప్రైజ్‌లు ఉంటాయి. అందరూ మాస్ బంక్ కొట్టండి. అందరూ గర్వపడేలా ఈ చిత్రం ఉంటుంది. నా కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ సినిమాగా నిలుస్తుంది. ఇంత వరకు ఎవ్వరూ చెప్పని, చూపించని ఎమోషనల్ డెప్త్‌ని తరుణ్ చూపించాడు. ఈ సినిమాకి, నా లైఫ్‌కి తరుణ్ హీరో’ అని అన్నానరు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ .. ‘‘విశ్వక్ సేన్, అభినవ్ ఇలా అందరూ ఈ 8 ఏళ్లలో ఎంతో ఎదిగారు. కానీ ఈ చిత్రం కోసం మళ్లీ 8 ఏళ్లు వెనక్కి వెళ్లారు. నా కోసం ఈ మూవీ సెట్‌లో ఎంతో సింపుల్‌గా ఉన్నారు. ఈఎన్‌ఈ ఫ్యాన్స్ అంతా కలిసి ఈ పార్ట్ 2ని తీశారు. ఆడియెన్స్ అడిగారు ఈ మూవీని తీశాం. నా కథను నేనే చెప్పాలని ‘ఈ నగరానికి ఏమైంది’ తీశాను. అప్పుడు నేను ఏ లెక్కలు వేసుకోలేదు. నా మనసుకి అనిపించింది నేను చేశాను. రీ రిలీజ్‌లో సంధ్య థియేటర్లో ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్, ఆ బాధ్యతతోనే ఒళ్లు దగ్గర పెట్టుకుని ‘ఈఎన్‌ఈ రిపీట్’ తీశాను. సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరినీ సమానంగానే చూశాం. ఎందులోనూ ఎక్కడా ఎవరితో బేధాలు చూపించలేదు. ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఉంటుంది. అప్పుడు చాలా మందికి థాంక్స్ చెప్పాలి. సౌండ్, మ్యూజిక్, కాస్ట్యూమ్, ఎడిటింగ్, యాక్టింగ్ ఇలా అన్నింట్లో ప్యాషన్ కనిపిస్తుంది. చిన్న సినిమాగా స్టార్ట్ అయింది కానీ ఆడియెన్స్ ప్రేమ వల్ల ఇంత పెద్ద సినిమాగా మారింది. ప్రేమ, భక్తితో ఈ చిత్రాన్ని తీశాను. నా ఫ్రెండ్స్ వివేక్, ఉప్పు, కౌశిక్‌లకు థాంక్స్. చిన్న పిల్లలు, పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి చూసేలా సినిమాని తీశాను. ఒక్క ఫ్రైడే కోసం ఈ సినిమా తీయలేదు. భవిష్యత్ తరాలు కూడా చూసి ఎంజాయ్ చేసేలా చిత్రాన్ని తీశాను’ అని అన్నారు.

Also Read:తీవ్రమైన తప్పులు చేశా..కానీ!

- Advertisement -