సమాజంలో మార్పు తీసుకొస్తూ, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న 20 మంది సాధారణ వ్యక్తుల అసాధారణ జీవిత ప్రయాణాలను వివరిస్తూ రూపొందించిన ‘గేమ్ ఛేంజర్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ పుస్తకంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మానవతావాది అజర్ మక్సూసీకి చోటు దక్కడం విశేషం.
ఉదయ్ శంకర్ రచించిన ఈ పుస్తకంలో ‘మెట్రో మ్యాన్’ ఈ. శ్రీధరన్, ‘భారత క్షిపణి మహిళ’ టెస్సీ థామస్, ‘చూపులేని విజేత’ శ్రీకాంత్ బొల్లా, ‘మౌంటైన్ మ్యాన్’ దశరథ్ మాంఝీ వంటి ఎందరో స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవిత కథలను పొందుపరిచారు. వీరితో పాటు సమాజ సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అజర్ మక్సూసీ ప్రయాణాన్ని కూడా ఈ పుస్తకంలో వివరించారు.
హైదరాబాద్ ఫుడ్మ్యాన్గా పేరొందిన అజర్ మక్సూసీ.. ‘ఆకలికి మతం లేదు’ అనే నినాదంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 5,000 రోజులకు పైగా ప్రతిరోజూ ఆకలితో ఉన్నవారికి ఉచితంగా ఆహారం అందిస్తూ వేలాది మంది కడుపు నింపుతున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా పేదలు, నిరుపేదలకు ఆహారం అందిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.
Also Read:కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: కేటీఆర్
అజర్ మక్సూసీ చేస్తున్న నిస్వార్థ సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అవసరంలో ఉన్నవారికి సేవ చేసేందుకు ఆయనకు భగవంతుడు మరింత శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు కేటీఆర్. సాధారణ వ్యక్తులు కూడా తమ సేవా కార్యక్రమాలతో సమాజంలో గొప్ప మార్పు తీసుకురాగలరని ‘గేమ్ ఛేంజర్స్’ పుస్తకం మరోసారి చాటిచెబుతోంది.

