పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం ఈ తుపాను నెమ్మదిగా కదులుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో పయనించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం అక్వాన్ తుపాను చెన్నైకి 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 610 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 610 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత ముందుకు కదులుతూ తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఎల్లుండి మధ్యాహ్నానికి నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీవ్ర తుపానుగా అక్వాన్ తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా.. గరిష్ఠంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Also Read:కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: కేటీఆర్
మరోవైపు ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుపాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుపాను కదలికలు, దాని తీవ్రతపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ జిల్లా యంత్రాంగాలకు తగిన సూచనలు జారీ చేస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రానున్న 48 గంటలు కీలకం కానుండటంతో ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని విపత్తుల నిర్వహణ యంత్రాంగం సూచిస్తోంది.

