BB10: పదకొండో వారం నామినేషన్స్‌లో రచ్చ!

3
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదకొండో వారం నామినేషన్స్ హీట్ పెంచాయి. ఈసారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా మాజీ కంటెస్టెంట్లు ఇంట్లోకి వచ్చి డిక్టేటర్లుగా వ్యవహరించారు. షాలినీ, అపూర్వ, దక్షి, ఝాన్సీ, మిథిలేష్ తమకు నచ్చిన కంటెస్టెంట్లను నామినేట్ చేస్తూ పలు ఆసక్తికరమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా వర్షిణి, నీతూ వ్యవహారశైలిపై వారు చేసిన వ్యాఖ్యలు ఇంట్లో పెద్ద చర్చకు దారితీశాయి.

ముందుగా ఇంట్లోకి వచ్చిన షాలినీ.. నీతూను నామినేట్ చేసింది. ఏడవడం, అరవడం, నామినేషన్లకు భయపడటం అంటూ ఆమెపై విమర్శలు చేసింది. దీనికి నీతూ కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. బయట ప్రేక్షకులను, ఇంట్లో సభ్యులను మెప్పించలేకపోయి ఎలిమినేట్ అయిన నువ్వు తనను నామినేట్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. రోహిత్ విషయంలో నీతూ వ్యవహరించిన తీరును కూడా షాలినీ ప్రస్తావించింది. చివరకు తన డ్యాగర్‌ను త్రిగుణ్‌కు ఇవ్వగా, అతడు శివ్‌ను నామినేట్ చేశాడు.

గోట్ టాస్క్‌లో త్యాగం చేశానని శివ్ చెప్పుకోవడంపై త్రిగుణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. స్నేహం పేరుతో తనను మోసం చేశారని ఆరోపిస్తూ నామినేషన్ వేశాడు. అనంతరం వచ్చిన మిథిలేష్.. సుధీర్ విషయంలో ముకేష్ వ్యవహరిస్తున్న తీరుతో పాటు శివ్, దేబ్జానీలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ముకేష్‌ను నామినేట్ చేశాడు. అతడి డ్యాగర్ అందుకున్న అమన్ కూడా ముకేష్‌ను టార్గెట్ చేశాడు.

ఆ తర్వాత వచ్చిన దక్షి నీతూను నామినేట్ చేస్తూ, ఇతర కంటెస్టెంట్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు సరికావని హితవు పలికింది. తన డ్యాగర్‌ను త్రిగుణ్‌కు ఇవ్వగా, అతడు వంశీని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ విషయంలో వంశీ మరింత కఠినంగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ఇక అపూర్వ ఎంట్రీతో నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. వర్షిణి గతంలో ఉపయోగించిన బీ, పీ పదాలను ప్రస్తావిస్తూ ఆమెను నిలదీసింది. మబ్బేష్ సపోర్ట్ లేకుండా వర్షిణి గెలవలేదని, త్రిగుణ్ బలహీనతలను టార్గెట్ చేయాలని కూడా మాట్లాడిందని ఆరోపించింది. దీనిపై వర్షిణి వివరణ కోరగా సుధీర్ స్పందించకుండా తప్పించుకున్నాడు. అపూర్వ తన డ్యాగర్‌ను శివ్‌కు ఇవ్వడంతో అతడు రాంప్రసాద్‌ను నామినేట్ చేశాడు.

Also Read:సిద్దిపేటపై రేవంత్ కక్ష సాధింపు!

చివరగా ఝాన్సీ.. దేబ్జానీని నామినేట్ చేస్తూ అవసరానికి తగ్గట్టుగా మాటలు మార్చుతున్నావని, ఉమెన్ కార్డును ఉపయోగిస్తున్నావని విమర్శించింది. ఆమె ఇచ్చిన డ్యాగర్‌తో ముకేష్ సుధీర్‌ను నామినేట్ చేశాడు. దీంతో సుధీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తప్పు తనదైతే ఇంటి నుంచి వెళ్లేందుకు సిద్ధమని అన్నాడు. మొత్తంగా మాజీ కంటెస్టెంట్ల రాకతో పదకొండో వారం నామినేషన్స్ వాడీవేడిగా సాగాయి.

- Advertisement -