వైరల్‌ వీడియో..సింహాన్ని బైక్‌లపై వెంటాడి!

1
- Advertisement -

గుజరాత్‌లో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సఫారీ పార్కులో ఓ సింహాన్ని అటవీ సిబ్బంది బైక్‌లపై వెంబడించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అటవీ శాఖ ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకుంది.

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా ధారి గిర్ ఈస్ట్ డివిజన్ పరిధిలో ఉన్న అంబర్డీ సఫారీ పార్కులో దీపావళి సెలవుల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు వ్యక్తులు వేర్వేరు మోటార్ సైకిళ్లపై సింహాన్ని వెంబడిస్తున్నట్లు కనిపిస్తోంది. సింహాన్ని ఓ బహిరంగ ప్రదేశం వైపు తరలించేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో ఉంది. వారిలో ఒకరు వాకీటాకీ పట్టుకుని ఉండగా, అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ బొలెరో వాహనం కూడా అక్కడి నుంచి వెళ్లడం కనిపించింది.

ఈ వీడియో బయటకు రావడంతో అటవీ సిబ్బంది వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వన్యప్రాణులను ఇలా బైక్‌లతో వెంబడించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. సెలవుల సమయంలో వీఐపీ సందర్శకులకు సింహాలను దగ్గరగా చూపించేందుకు సిబ్బంది ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి.

అయితే సింహాన్ని వేధించారనే ఆరోపణలను అటవీ అధికారులు ఖండించారు. సింహాన్ని దాని కోసం కేటాయించిన ఎన్‌క్లోజర్‌లోకి తిరిగి పంపించేందుకు సిబ్బంది సాధారణ విధుల్లో భాగంగా ఈ చర్య చేపట్టారని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

Also Read:రెండోసారి ICC చైర్మన్‌గా జై షా

- Advertisement -