భారత్, ఈజిప్ట్ దేశాలు తమ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక చర్చలు జరిపాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు రెట్టింపు చేసి 12 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం వాణిజ్యేతర అడ్డంకులను తగ్గించడం, కస్టమ్స్ ప్రక్రియలను సులభతరం చేయడం, నాణ్యతా ప్రమాణాలను బలోపేతం చేయడం, ఇరు దేశాల మార్కెట్లలో మెరుగైన అవకాశాలు కల్పించడంపై చర్చించాయి. ఈ విషయాన్ని సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటన వెల్లడించింది.
భారత్, ఈజిప్ట్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందం (PTA) లేదా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. ఈ బృందం ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, విధివిధానాలను పరిశీలించనుంది.
ఈ ఒప్పందాల ద్వారా ఇరు దేశాల మార్కెట్లలో పరస్పర వాణిజ్య అవకాశాలు మెరుగుపడటంతో పాటు పెట్టుబడుల సంబంధాలు బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.
అంతేకాకుండా వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న సమస్యల పరిష్కారంపైనా ఇరు దేశాలు చర్చించాయి. ముఖ్యంగా ఉత్పత్తుల రిజిస్ట్రేషన్లు, వాణిజ్యానికి సంబంధించిన నియంత్రణ విధానాలు, ఇతర అనుమతుల ప్రక్రియల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంపై దృష్టి సారించాయి.
Also Read:రెండోసారి ICC చైర్మన్గా జై షా
ఈ చర్యల ద్వారా భారత్–ఈజిప్ట్ మధ్య వాణిజ్య సంబంధాలకు కొత్త ఊపు తీసుకురావడంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 12 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

