ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలు తన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో అత్యంత కీలకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అలాగే భారత్ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న ‘మహాసాగర్’ (MAHASAGAR) విజన్లోనూ ఆసియాన్ దేశాలకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. రెండు రోజుల ఫిలిప్పీన్స్ పర్యటనకు సోమవారం బయలుదేరిన సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరగనున్న 23వ ఆసియాన్-భారత్ సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపట్టారు. నవంబర్ 17న జరిగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ సహకారం, ఆర్థిక సంబంధాలు, భద్రత వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
తన పర్యటనతో ఆసియాన్ దేశాలతో భారత్కు ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపు వస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. శతాబ్దాల నాగరికతా సంబంధాల నుంచి ప్రారంభమైన భారత్-ఆసియాన్ బంధాలు ప్రస్తుతం వాణిజ్యం, రవాణా అనుసంధానం, సముద్ర భద్రత, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాల వరకు విస్తరించాయని తెలిపారు.
Also Read:గొప్ప అనుభూతిని ఇచ్చే ‘ఆకాశంలో ఒక తార’!
ఆసియాన్ నాయకులతో కలిసి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. వృద్ధి, అనుసంధానం, సౌభాగ్యం వంటి ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు.
తూర్పు ఆసియా సదస్సు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించేందుకు కీలక వేదికగా నిలుస్తుందని మోదీ అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వివిధ దేశాల నాయకులతో అభిప్రాయాలు పంచుకోనున్నట్లు వెల్లడించారు. ఫిలిప్పీన్స్లోని భారతీయ ప్రవాసులతోనూ ప్రధాని సమావేశం కానున్నారు.

