అమెరికా అంతరిక్ష ప్రయోగ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెజాన్‌కు చెందిన 40 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన వల్కన్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. నింగిలోకి దూసుకెళ్లిన సుమారు 10 నిమిషాలకే రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. దీంతో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చలేకపోయింది. ఈ పరిణామం అమెజాన్ ప్రతిష్టాత్మకమైన లియో ఇంటర్నెట్ ప్రాజెక్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది.
ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అమెజాన్ లియో ప్రాజెక్టులో భాగంగా 40 ఉపగ్రహాలను రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే రాకెట్ రెండో దశలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. దీంతో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం సాధ్యం కాలేదు.
ఈ ప్రయోగ వైఫల్యాన్ని రాకెట్‌ను అభివృద్ధి చేసిన యునైటెడ్ లాంచ్ అలయన్స్ (ULA) ధ్రువీకరించింది. బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ULA ఏర్పాటైంది. రాకెట్ రెండో దశలో తలెత్తిన సమస్యపై సంస్థ సాంకేతిక బృందాలు పరిశీలన చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అమెజాన్‌కు చెందిన 40 ఉపగ్రహాలు ధ్వంసమైనట్లు సమాచారం.
Also Read:గొప్ప అనుభూతిని ఇచ్చే ‘ఆకాశంలో ఒక తార’!
20 ఏళ్ల ULA చరిత్రలో తొలిసారిగా ఇలాంటి ప్రయోగ వైఫల్యం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో అమెజాన్ ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రాజెక్టు భవిష్యత్ ప్రయోగాలపై ఆసక్తి నెలకొంది.

