వీసీ జానయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశం

1
- Advertisement -

అగ్రికల్చర్ యూనివర్సిటీలో కలకలం రేపుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వైస్ ఛాన్సలర్ ఆల్దాస్ జానయ్యపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ కె. లక్ష్మీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. ఐఏఎస్ అధికారులు గోపి, రాహుల్ రాజ్‌తో పాటు ప్రజ్వల ఎన్జీవో సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మహిళా ప్రొఫెసర్‌పై వీసీ ఆల్దాస్ జానయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. అదే సమయంలో బాధిత మహిళా ప్రొఫెసర్ భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు, ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసి 15 రోజులు దాటినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు వీసీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శిస్తున్నారు. యూనివర్సిటీలో ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తడంతో గవర్నర్ ఆదేశాల మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read:KTR:వట్టిపోయిన శ్రీరాంసాగర్‌కు జీవం పోసింది కేసీఆరే!

ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వైస్ ఛాన్సలర్ ఆల్దాస్ జానయ్యను నేడు విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. ప్రభుత్వ కమిటీ విచారణ, మహిళా కమిషన్ చర్యలతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -