కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.10 వేల కోట్ల నిధులు తీసుకెళ్తుండటంపై మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈర్ష్య పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పాలమూరు ప్రాంత అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి కొడంగల్‌కు తీసుకెళ్తున్న రూ.10 వేల కోట్లలో కనీసం రూ.1,000 నుంచి రూ.1,500 కోట్లు మూడేళ్ల కిందటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఖర్చు చేసి ఉంటే మిగిలిన పనులు పూర్తయ్యేవని నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు. కొడంగల్, నారాయణపేట ప్రాంతాలకు నీటిని అందించాల్సిన కాలువలను రద్దు చేసి రేవంత్ రెడ్డి ఆయా ప్రాంతాలను చుక్కనీరు లేకుండా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలతో మళ్లీ పాలమూరు ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ప్రభుత్వ ఖర్చుతో పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్న ముఖ్యమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాధనంతో వేడుకలు చేసుకుంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి సాగునీటి విషయంలో ముఖ్యమంత్రి లేదా నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పటివరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ కూడా రాయలేదని ఆరోపించారు.
Also Read:అనీష్‌కి సినిమా అంటే ప్రాణం!
శ్రీశైలం జలాలను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, నార్లాపూర్ లిఫ్టుల ద్వారా ఎత్తిపోసి ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను నింపి ఉంటే కరువు సమయంలో భూగర్భ జలాలు పెరిగేవని ఆయన అభిప్రాయపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రధాన కాలువపై పేరుకుపోయిన మట్టిని తొలగించాలని కోరినా ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి చేసిన గడ్డం, మీసాల వ్యాఖ్యలను కూడా నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి వ్యక్తిగత రూపురేఖల గురించి మాట్లాడటం తగదన్నారు. భారతదేశంలో ఇంత దారుణంగా విఫలమైన ప్రభుత్వం మరొకటి లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

