శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు

1
- Advertisement -

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్తిక మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 9వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవలు, స్వామివారి దర్శన విధానంలో కీలక మార్పులు చేపట్టింది.

కార్తిక మాసం సందర్భంగా రూ.5 వేల గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 సామూహిక అభిషేకాలను దేవస్థానం రద్దు చేసింది. ఈ సేవలకు బదులుగా భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనుంది. భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు అందరికీ సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్పర్శ దర్శనంపైనా దేవస్థానం మార్పులు ప్రకటించింది. ప్రతి శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా భక్తులకు స్పర్శ దర్శనం నిలిపివేయనున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు విడతల వారీగా భక్తులకు మల్లన్న స్పర్శ దర్శనం కల్పించనున్నారు. భక్తులు ఈ మార్పులను గమనించి దర్శనానికి అనుగుణంగా తమ పర్యటనను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read:అనీష్‌కి సినిమా అంటే ప్రాణం!

ఈ నెల 20వ తేదీన ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రమైన శ్రీశైలంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. కార్తిక మాసంలో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భక్తులకు అవసరమైన ఏర్పాట్లపై దేవస్థానం దృష్టి సారించింది.

- Advertisement -