కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘Belonging: A Journey of Love’ రాజకీయంగా కొత్త వివాదానికి తెరలేపింది. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ పరిణామాలపై పుస్తకంలో చేసిన ప్రస్తావనపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు స్పందించారు. సోనియా వెల్లడించిన విషయాలపై ఆప్ సందేహాలు వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో వ్యవహరించిందంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది.
ఆపరేషన్ బ్లూస్టార్ అనంతరం స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీక్షించినప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారని సోనియా తన పుస్తకంలో రాశారు. ఇందిరాగాంధీ ముఖంపై కన్నీళ్లు కనిపించాయని ఆపరేషన్ ముగిసిన తీరు, పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆమె బాధ, పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తనకు అనిపించిందని వివరించారు.
ఈ అంశంపై ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఇందిరాగాంధీ స్వయంగా అప్పుడే తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసి ఉంటే దానికి మరింత ప్రాధాన్యం ఉండేదని అన్నారు. ఇప్పుడు సోనియా గాంధీ చెబుతున్న మాటలను స్వతంత్రంగా ధ్రువీకరించలేమని, అవి వినికిడి మాటలుగానే చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావించవచ్చని పేర్కొన్నారు.
స్వర్ణ దేవాలయంలో సైన్యాన్ని మోహరించడం, ఆ తర్వాత ఢిల్లీలో సిక్కులపై జరిగిన హింస వంటి ఘటనలపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ భోలా సింగ్ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నామమాత్రపు నాయకుడిగా ఉన్నారని, తెరవెనుక నుంచి సోనియా గాంధీ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించారని ఆరోపించారు. ఆపరేషన్ బ్లూస్టార్పై సోనియా పుస్తకంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.
ఎమర్జెన్సీ విధించడం నుంచి అల్లర్లను ప్రేరేపించడం వరకు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతదూరమైనా వెళ్లిందని భోలా సింగ్ ఆరోపించారు. అధికార దాహం కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిలో పదేపదే కనిపించిందని వ్యాఖ్యానించారు.
Also Read:అనీష్‌కి సినిమా అంటే ప్రాణం!
1984 జూన్‌లో పంజాబ్‌లో సిక్కు మిలిటెన్సీని అణచివేసే లక్ష్యంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు భారత సైన్యం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టింది. జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే, ఆయన అనుచరులు అక్కడ ఆయుధాలు సమకూర్చుకున్నారనే కారణంతో ఈ సైనిక చర్య చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భింద్రన్‌వాలే సహా పలువురు మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అదే ఏడాది అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన ఇద్దరు సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురయ్యారు.

