ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో విడిపోతున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన కాలాన్ని కలిసి గడిపామని, ఇప్పుడు పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
వివాహ బంధం ముగిసినప్పటికీ తాము మంచి స్నేహితులుగా కొనసాగుతామని పవన్ కళ్యాణ్, అన్నా స్పష్టం చేశారు. తమ పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉంటామని తెలిపారు. పిల్లల సంతోషం, సంక్షేమం, భవిష్యత్తు తమ ఇద్దరికీ ఎప్పటికీ అత్యంత ముఖ్యమైనవని పేర్కొన్నారు.
ఈ వ్యక్తిగత మార్పు సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే విడిపోవడానికి గల కారణాలను మాత్రం సంయుక్త ప్రకటనలో వెల్లడించలేదు. విడాకుల ప్రక్రియ, పిల్లల సంరక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా ప్రకటనలో ఎలాంటి వివరాలు పేర్కొనలేదు.
Also Read:వందేభారత్ స్లీపర్ రైళ్లలో ‘తత్కాల్’ ఉండవు!
జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల మధ్య గత కొన్ని నెలలుగా విడాకుల విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాయి.
పవన్ కళ్యాణ్ 1997లో విశాఖపట్నానికి చెందిన నందినిని వివాహం చేసుకున్నారు. 1999లో ఇద్దరూ విడిపోయినప్పటికీ 2008లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణు దేశాయ్‌ను 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2011లో విడిపోయిన ఈ జంట 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
అనంతరం 2013లో రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. వీరికి పోలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అన్నాతో కూడా విడిపోతున్నట్లు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది.


