తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలో అక్రమ చొరబాటుదారులను గుర్తించి ఓటరు జాబితాల నుంచి తొలగిస్తామని వారిని భారత్‌లో అడుగుపెట్టనివ్వబోమని స్పష్టం చేశారు.నిజాంను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదుర్కోకపోతే హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించేది కాదని అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. నగరంలో ఇప్పటికీ వేలాది మంది రోడ్లపైనే ఉన్నారని పేర్కొన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్, రాహుల్ గాంధీ నిర్వహించిన ర్యాలీ ఓట్లు కోల్పోయిన వారి కోసం కాదని, అక్రమ వలసదారులను కాపాడేందుకేనని ఆరోపించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్ని ర్యాలీలు నిర్వహించినా అక్రమ చొరబాటుదారులను దేశంలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. భారత పౌరులకు మాత్రమే దేశంలో ఓటు వేసే హక్కు ఉంటుందని చెప్పారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను అమిత్ షా తప్పుబట్టారు. దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు, మరణించిన వారి పేర్లే ఓటరు జాబితాల్లో ఉన్నాయని, అలాంటి ఓట్లను తొలగించాలా వద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గతంలో బోగస్ ఓట్లతో ఎన్నికల్లో గెలిచిందని విమర్శించారు. ప్రస్తుతం తొలగిస్తున్న మూడు కోట్ల ఓట్లు అసలు లేని వ్యక్తులకు సంబంధించినవని, వారంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులని ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఎన్ని ర్యాలీలు నిర్వహించినా ఎస్‌ఐఆర్ ప్రక్రియను అడ్డుకోలేరని అమిత్ షా అన్నారు. 2014, 2019, 2023 ఎన్నికల్లో మోదీ విజయం సాధించినప్పుడు ఎస్‌ఐఆర్ నిర్వహించారా అని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్ వల్లే బీజేపీ గెలుస్తోందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చకు వస్తే తాము చేస్తున్నది నిజమని ప్రజలకు తెలిసిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ నేతలు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు.
Also Read:శ్రీలంకను తక్కువ అంచనా వేయొద్దు!
రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన అమిత్ షా.. ఇటీవల నిర్వహించిన మాక్ పార్లమెంట్‌లోనూ ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగానే ఉన్నారని ఎద్దేవా చేశారు. కనీసం అక్కడైనా ప్రధానిగా ఉంటే సోనియా గాంధీ సంతోషించేవారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ క్రమంగా కనుమరుగవుతోందని తెలంగాణలో కొంత ఉనికి ఉన్నప్పటికీ ప్రజలు ఆ పార్టీని కూడా ఓడిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని విమర్శించారు. రాహుల్ గాంధీని ఓడించడానికి ప్రధాని మోదీ అవసరం లేదని తెలంగాణ బీజేపీ యువమోర్చా నేత చాలని వ్యాఖ్యానించారు.

