కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ అనాలోచిత నిర్ణయాలు, వ్యవహారశైలి వల్లే ప్రధాని నరేంద్ర మోదీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ ఓటు చోరీపై ధర్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇంతకంటే పెద్ద జోక్ మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు.
మరోవైపు తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించడంపై కూడా రేవంత్ రెడ్డిని కౌశిక్ రెడ్డి నిలదీశారు. క్రాప్ హాలిడే ప్రకటించడానికి తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి సొంత జాగీరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించకుండా మహారాష్ట్రకు వెళ్లి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
Also Read:లాలూ ప్రసాద్ యాదవ్కు రిలీఫ్
ప్రస్తుతం తుమ్మిడిహట్టి వద్ద 5 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా, మేడిగడ్డ వద్ద 25 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే గతంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే సరైందని నిరూపితమైందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

