తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. జాబ్ క్యాలెండర్‌కు బదులుగా స్కామ్ క్యాలెండర్‌ను అమలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. జర్మనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ TOMCOM పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇంజినీరింగ్ ఉద్యోగాల పేరుతో యువకులను జర్మనీకి పంపించి అక్కడ మాంసం దుకాణాల్లో పని చేయిస్తున్నారని పేర్కొన్నారు.
జర్మనీలో ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాల గురించి TOMCOM ఇటీవల ప్రకటనలు విడుదల చేసిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రకటనలను చూసి వందలాది మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఉచితంగా కల్పించాల్సిన అవకాశాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.4.10 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపించారు.
అంతేకాకుండా, TOMCOM పేరు లేకుండా ‘ఫెయిర్ స్ట్రీట్’ (Fair Street) అనే సంస్థ పేరుతో ఉన్న ఒప్పంద పత్రాలపై నిరుద్యోగులతో సంతకాలు చేయించారని విమర్శించారు. సుమారు 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసినప్పటికీ, కనీసం పది మందిని కూడా జర్మనీకి పంపించలేదని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో ఒక నిరుద్యోగ యువకుడికి మెకాట్రానిక్స్ విభాగంలో ఇంజినీర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి జర్మనీకి పంపించినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత బీఫ్, మటన్ తదితర మాంసాన్ని కోయాలని అతని చేతికి కత్తి ఇచ్చారని ఆరోపించారు. ఇంజినీరింగ్ ఉద్యోగం ఆశతో విదేశాలకు వెళ్లిన యువకుడికి ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
Also Read:తులాభారం షూట్లో రవితేజ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నెలకో స్కామ్ బయటపడే పరిస్థితి నుంచి వారానికో స్కామ్ వెలుగులోకి వచ్చే పరిస్థితికి రాష్ట్రం చేరిందని వ్యాఖ్యానించారు.
నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత యువకులకు న్యాయం చేయడంతో పాటు, వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

