ఇజ్రాయెల్..నెతన్యాహుకు అగ్నిపరీక్ష!

4
- Advertisement -

ఇజ్రాయెల్‌లో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన రాజకీయ జీవితంలో కీలకమైన పోరును ఎదుర్కొంటున్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాలు, ఇరాన్‌తో యుద్ధం నిర్వహణ, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం జరిగే పోలింగ్‌తో దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ ఎన్నికల్లో సుమారు 73 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లలో ఎక్కువమంది తమను మధ్య-కుడి లేదా కుడిపక్ష భావజాలం కలిగినవారిగా అభివర్ణించుకుంటున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. ఓటు వేసేందుకు విదేశాల నుంచి కూడా వేలాది మంది ఇజ్రాయెల్‌కు తిరిగివచ్చారు. దేశంలో మార్పు అవసరమని పలువురు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇజ్రాయెల్‌లో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నేతగా 77 ఏళ్ల నెతన్యాహుకు గుర్తింపు ఉంది. అయితే ఈసారి ఆయనకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సెంట్రిస్ట్ నేత గాడి ఐసెన్‌కోట్…. నెతన్యాహుకు ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తున్నారు. ఇజ్రాయెల్ రక్షణ దళాల మాజీ చీఫ్‌గా పనిచేసిన ఆయన, యాషార్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ కూడా నెతన్యాహు కూటమికి సవాలు విసురుతున్నారు. బెన్నెట్ నేతృత్వంలోని బి’యాచాద్ కూటమిలో మాజీ ప్రధాని యైర్ లాపిడ్‌కు చెందిన యేష్ అటిడ్ పార్టీ కూడా ఉంది.

Also Read:ఆర్నబ్ తుపాన్..ఏపీకి భారీ ముప్పు!

ఇజ్రాయెల్‌లో దామాషా పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. దేశమంతటినీ ఒకే ఎన్నికల నియోజకవర్గంగా పరిగణించి పార్లమెంటు అయిన నెస్సెట్‌లోని 120 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఓటర్లు వ్యక్తిగత అభ్యర్థులకు కాకుండా రాజకీయ పార్టీల జాబితాలకు ఓటు వేస్తారు.

నెస్సెట్‌లో ప్రాతినిధ్యం పొందేందుకు ఒక పార్టీ కనీసం 3.25 శాతం ఓట్లు సాధించాలి. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి ఆటోమేటిక్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభించదు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 61 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు అవసరం. దీంతో ఎన్నికల అనంతరం కూటముల ఏర్పాటు కీలకంగా మారుతుంది.

- Advertisement -