బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా మరోసారి ఘన విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న మితవాద నేత ఫ్లావియో బొల్సొనారోపై విజయం సాధించి, చారిత్రాత్మకంగా నాలుగోసారి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లూలాకు 51.75 శాతం ఓట్లు రాగా, బొల్సొనారోకు 48.25 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో లాటిన్ అమెరికాలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్లో లూలా మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నారు.
ఈ విజయంతో దక్షిణ అమెరికాలో కొనసాగుతున్న సంప్రదాయవాద రాజకీయాల ప్రభావానికి కొంత ఎదురుదెబ్బ తగిలింది. అర్జెంటీనా, చిలీ, కొలంబియా, పెరూ వంటి దేశాల్లో మితవాద రాజకీయ శక్తులు బలపడుతున్న నేపథ్యంలో లూలా విజయం ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయం అనంతరం లూలా మాట్లాడుతూ.. బ్రెజిల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు వేయడం ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించగలిగామని అన్నారు. డిజిటల్ వేదికల ద్వారా జరిగిన విదేశీ జోక్యాన్ని ఓడించామని పేర్కొన్నారు. బ్రెజిల్ ఎవరికీ పెరటి ప్రదేశం కాదని, దేశ నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతామని తెలిపారు. లూలా విజయంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చారిత్రాత్మక మలుపు అని ఆయన పార్టీ నేత ఎడిన్హో సిల్వా వ్యాఖ్యానించారు.
కొన్ని ప్రాంతాల్లో బస్సుల రాకపోకలు నిలిపివేయడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారని లూలా ఆరోపించారు. దీంతో సుప్రీంకోర్టు ఓటింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించింది. అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ గడువు పెంచాలని బొల్సొనారో కూడా కోరినట్లు సమాచారం.
Also Read:BB10:గేమ్ ఛేంజర్‌గా ముకేశ్
దాదాపు సగం మంది ఓటర్లు ప్రత్యర్థికి మద్దతు ఇవ్వడంతో లూలా నాలుగో పదవీకాలం సవాళ్లతో కూడుకునే అవకాశముంది. ఆర్థిక వృద్ధి మందగించే అంచనాలు, పెరుగుతున్న నేరాలు, ప్రజల భద్రత వంటి అంశాలు ఆయనకు సవాళ్లుగా మారనున్నాయి.

