ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. వెస్టిండీస్ మాజీ స్టార్ క్రికెటర్ కీరన్ పొలార్డ్‌ను తమ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. జట్టును ఆరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టడమే లక్ష్యంగా పొలార్డ్ తన బాధ్యతలను చేపట్టనున్నాడు.
ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన మహేల జయవర్ధనే తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన కోచింగ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ టైటిళ్లలో మూడు టైటిళ్లను గెలుచుకుంది. ఇప్పుడు ఆ బాధ్యతలను పొలార్డ్ చేపట్టడంతో జట్టు భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తి నెలకొంది.
పొలార్డ్‌కు ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2010లో ఆటగాడిగా ఈ ఫ్రాంచైజీలో చేరిన ఆయన, జట్టు సాధించిన ఐదు ఐపీఎల్ టైటిళ్లలో భాగస్వామిగా నిలిచాడు. అంతేకాకుండా 2011, 2013లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లు గెలిచిన జట్లలోనూ సభ్యుడిగా ఉన్నాడు.
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నానని పొలార్డ్ పేర్కొన్నాడు. ఈ జట్టు తన జీవితంలో, క్రికెట్ కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన భాగమని తెలిపాడు. ఆటగాడిగా, కోచ్‌గా ముంబై ఇండియన్స్‌తో తనకున్న అనుబంధం ప్రత్యేకమని వివరించాడు. జట్టు యాజమాన్యం నీతా అంబానీ, ఆకాశ్ అంబానీతో పాటు మొత్తం ముంబై ఇండియన్స్ కుటుంబం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపాడు.
Also Read:ప్రాసెస్డ్ ఫుడ్‌తో పెద్దపేగు క్యాన్సర్?

