మేడిగడ్డ కూలిపోలేదు..కూల్చేశారు!

3
- Advertisement -

మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే కుట్ర జరిగిందని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఆయన.. ఉత్తరాఖండ్‌లో డ్యామ్ కూలిపోయిన ఘటనపై స్పందించని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మేడిగడ్డ విషయంలో మాత్రం ఎందుకు స్పందించారని ప్రశ్నించారు.

అక్టోబర్ 3న ఉత్తరాఖండ్‌లో డ్యామ్ కూలిపోయి 74 మంది మరణించారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఘటనపై జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (NDSA)కు కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వచ్చిన NDSA అధికారులు, ఉత్తరాఖండ్ ఘటనపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజీ కూల్చివేతకు సంబంధించి అధికారులు నమోదు చేసిన కేసు ఏమైందని ప్రశ్నించారు. మూడేళ్లు గడుస్తున్నా ఆ కేసు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజినీర్ సురేష్ వాస్తవాలు వెల్లడించారనే కారణంతోనే ఆయనను సస్పెండ్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం ప్లాంట్ వ్యవహారాలను పరిశీలించేందుకు ఐఏఎస్ అధికారుల కమిటీని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషియాలజీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి అంశాలు చదివిన అధికారులకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, బొగ్గు వినియోగం వంటి సాంకేతిక అంశాలు ఎలా అర్థమవుతాయని ప్రశ్నించారు.

Also Read:ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ నేలమట్టం

మరోవైపు, ట్రాన్స్‌కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు వెళ్లడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలను అభివృద్ధి చేసి, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసిన ఇంజినీర్లపై ప్రభుత్వం ఎందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, విద్యుత్ శాఖ అధికారుల వ్యవహారాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ నేత తీవ్ర విమర్శలు చేశారు.

- Advertisement -