ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్ సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 22న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. భారత్, పాకిస్థాన్ జట్లను వేర్వేరు గ్రూపుల్లో ఉంచారు.
గత టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టును గ్రూప్-ఏలో చేర్చారు. ఈ గ్రూపులో భారత్‌తో పాటు ఐర్లాండ్, వెస్టిండీస్, ఆతిథ్య దేశం నేపాల్ ఉన్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌లో జనవరి 22న వెస్టిండీస్‌తో తలపడనుంది. జనవరి 24న నేపాల్‌తో, జనవరి 26న ఐర్లాండ్‌తో ఆడనుంది.గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఆస్ట్రేలియా గ్రూప్-సిలో ఉంది. ఆ జట్టు జనవరి 21న నైజీరియాతో తొలి మ్యాచ్ ఆడుతుంది. మరోవైపు, పాకిస్థాన్ గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, సమోవా జట్లతో పోటీపడనుంది.
టోర్నీలో పాల్గొనే 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. గ్రూప్ దశ జనవరి 26తో ముగుస్తుంది. అనంతరం అర్హత సాధించిన జట్లు సూపర్ సిక్స్ దశలో రెండు గ్రూపులుగా విడిపోతాయి. సూపర్ సిక్స్‌లో ప్రతి గ్రూపు నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.ఫిబ్రవరి 4న చటోగ్రామ్‌లో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 5ను రిజర్వ్ డేగా కేటాయించారు. ఫిబ్రవరి 6న చటోగ్రామ్‌లోనే ఫైనల్ నిర్వహిస్తారు. అవసరమైతే ఫిబ్రవరి 7ను రిజర్వ్ డేగా ఉపయోగించనున్నారు.
Also Read:ఎమ్మెల్యే వివేకా బర్త్ డే..గ్రీన్ ఛాలెంజ్
నాలుగు గ్రూపుల వివరాలు
గ్రూప్-ఏ: భారత్, ఐర్లాండ్, వెస్టిండీస్, నేపాల్.
గ్రూప్-బి: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, సమోవా.
గ్రూప్-సి: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ).
గ్రూప్-డి: ఇంగ్లండ్, శ్రీలంక, అమెరికా, స్కాట్లాండ్.
ఈ టోర్నీలో భారత యువ మహిళల జట్టు మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి శుభారంభం చేయాలని భారత జట్టు అభిమానులు ఆశిస్తున్నారు.

