కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తజికిస్థాన్ పర్యటనకు బయలుదేరారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) ప్రభుత్వాధినేతల మండలి 25వ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన దుషాంబేకు వెళ్లనున్నారు. అక్టోబర్ 19, 20 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుండటంపై రాజ్‌నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
ఎస్సీఓ సభ్య దేశాల మధ్య బహుళపక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని రక్షణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, రవాణా అనుసంధానం, నూతన ఆవిష్కరణలు, సాంస్కృతిక, మానవతా సంబంధాల అభివృద్ధిపై చర్చించనున్నారు.
సభ్య దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న సహకార కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంతో పాటు, సంస్థ ఆర్థిక, సంస్థాగత నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీఓ కార్యకలాపాల్లో భారత్ చురుకుగా పాల్గొంటోందని రక్షణ శాఖ పేర్కొంది. స్టార్టప్‌లు, నూతన ఆవిష్కరణలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతం వంటి రంగాల్లో భారత్ తన వంతు సహకారం అందిస్తోంది.
Also Read:జనవరి 12 విడుదల..అప్డేట్
ఈ సమావేశం ద్వారా ఇతర సభ్య దేశాలతో అభిప్రాయాలను పంచుకోవడానికి, పరస్పర ప్రయోజనాలను అందించే సహకార మార్గాలను అన్వేషించడానికి భారత్‌కు అవకాశం లభించనుంది.

