మెడికవర్ ఆసుపత్రి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై సీఎం బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ, పలు సంస్థల్లో వాటాలున్నాయంటూ ముగ్గురు వ్యక్తుల పేర్లను ప్రస్తావించారు.
దుంప శిరీష, అన్నం శరత్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డికి మెడికవర్ ఆసుపత్రితోపాటు రేవంత్ రెడ్డి అల్లుడికి చెందిన మాక్స్ బీఎన్ ఫార్మా, ఆయన కుమార్తె పాఠశాలలను నిర్మిస్తున్నట్లు ఆరోపిస్తున్న మైండ్ వాల్ట్ సంస్థల్లోనూ వాటాలు ఉన్నాయని క్రిశాంక్ పేర్కొన్నారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మెడికవర్ ఆసుపత్రి ద్వారా రూ.13,200 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారంటూ రేవంత్ రెడ్డిపై క్రిశాంక్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆయన ఆధారాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తూ, రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో ఆ మొత్తాన్ని వారికి పంచిపెట్టాలని వ్యాఖ్యానించారు.మెడికవర్ ఆసుపత్రి, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ట్ సంస్థలతో సంబంధాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని క్రిశాంక్ కోరారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
Also Read:కాంగ్రెస్ అరాచకం..రాజ్నాథ్ ఫైర్

