మొబైల్ ఫోన్‌కు గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఎవరివో తెలుసుకోవడం ఇక సులభం కానుంది. కాల్ చేసే వ్యక్తి పేరు, ఫోన్ నంబర్‌ను నేరుగా మొబైల్ స్క్రీన్‌పై చూపించే కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం టెలికాం ఆపరేటర్లందరూ 2026 నవంబర్ 1 నుంచి కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సేవలను అమలు చేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఆదేశించినట్లు సమాచారం. 4G, 5G నెట్‌వర్క్‌లలో ఈ సేవ డిఫాల్ట్‌గా అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం మన ఫోన్‌లో సేవ్ చేసుకున్న నంబర్ల నుంచి కాల్ వస్తేనే సాధారణంగా ఎవరు ఫోన్ చేస్తున్నారో గుర్తించగలుగుతున్నాం. కొత్త CNAP విధానంలో మాత్రం ఫోన్‌లో నంబర్ సేవ్ చేయకపోయినా కాల్ చేస్తున్న వ్యక్తి పేరు కనిపిస్తుంది.మీ కాంటాక్ట్స్‌లో ఇప్పటికే ఆ నంబర్ ఉంటే, మీరు సేవ్ చేసిన పేరే స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఒకవేళ కొత్త నంబర్ నుంచి కాల్ వస్తే, టెలికాం సంస్థ వద్ద ఉన్న వినియోగదారుల డేటాబేస్ ఆధారంగా కాలర్ పేరును చూపిస్తారు. విదేశాల నుంచి వచ్చే కాల్స్‌కు మాత్రం ‘ఇంటర్నేషనల్ కాల్’ అని కనిపిస్తుంది.
ఈ సేవ అమలులోకి వస్తే, ప్రత్యేకంగా ఇతర యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే కాలర్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. 4G, 5G వినియోగదారులకు ఈ సేవ ఆటోమేటిక్‌గా అందుబాటులోకి రానుంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేలా టెలికాం సంస్థలు చర్యలు తీసుకోవాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం సూచించినట్లు కథనంలో పేర్కొన్నారు. కాల్ ముగిసిన తర్వాత కాలర్ వివరాలకు సంబంధించిన అభ్యర్థన, ప్రతిస్పందన డేటాను తొలగించాల్సి ఉంటుందని సమాచారం.
తమ నంబర్‌ను ఇతరులకు కనిపించకుండా ఉంచేందుకు CLIR (Calling Line Identification Restriction) సేవను వినియోగించే వారి వివరాలను CNAP ద్వారా బయటపెట్టరు. భద్రతా కారణాలతో ఈ మినహాయింపు కల్పించనున్నారు.
Also Read:ఢిల్లీ నిరసనలు..అరెస్టులపై పిటిషన్లు
కంపెనీలు, ఎక్కువ సంఖ్యలో ఫోన్ నంబర్లు వినియోగించే వ్యాపార సంస్థలు తమ కాల్స్‌కు ప్రత్యేకంగా ఏ పేరును చూపించాలనుకుంటున్నాయో ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఆ పేరు నమోదైన ట్రేడ్‌మార్క్ అయి ఉండాలి లేదా జీఎస్టీ గుర్తించిన వ్యాపార పేరుగా ఉండాలి. ఇందుకు సంబంధించిన పత్రాలను టెలికాం సంస్థలు పరిశీలిస్తాయి.
ఈ కొత్త విధానం ద్వారా స్పామ్ కాల్స్, గుర్తుతెలియని కాల్స్‌ను గుర్తించడం సులభమవుతుంది. అయితే, స్క్రీన్‌పై ధ్రువీకరించిన పేరు కనిపించినంత మాత్రాన ఆ కాల్ పూర్తిగా నమ్మదగినదని భావించకూడదు. మోసగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేసే అవకాశం ఉన్నందున, బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోకూడదు.

