పెరిగిన రేవంత్ కుటుంబ సంపద!

0
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సంపద పెరగలేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సంపద మాత్రమే పెరిగిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. మేడ్చల్ జిల్లాలోని సర్వే నంబర్ 81లో ముఖ్యమంత్రి కుమార్తె నైమిష రెడ్డి కార్పొరేట్ పాఠశాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నిర్మాణానికి సంబంధించి పలు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

గత ఏడాది భూమిని కొనుగోలు చేసి, ఈ ఏడాదిలోనే పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ నిర్మాణాల కోసం ‘మైండ్ వాల్ట్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారని, అందులో దుంప శిరీష భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. పాఠశాల నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని, కనీసం ప్లేగ్రౌండ్ కూడా లేకుండానే కార్పొరేట్ స్కూల్‌ను నిర్మిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు, పాఠశాల నిర్మాణం పూర్తికాకముందే వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు వెబ్‌సైట్‌లో ప్రకటించారని క్రిశాంక్ పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.2.5 లక్షల ఫీజు వసూలు చేసేందుకు నిర్ణయించారని ఆరోపించారు. విద్య అనేది వ్యాపారం కాదని, సేవ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని గుర్తుచేస్తూ.. ఆయన కుటుంబానికి చెందిన పాఠశాలలో ఇంత భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని క్రిశాంక్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం, కార్పొరేట్ పాఠశాలల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.

Also Read:గోవా పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్!

విద్యను సేవగా భావించాలని చెబుతున్న ముఖ్యమంత్రి, తన కుటుంబానికి సంబంధించిన విద్యాసంస్థ విషయంలోనూ అదే విధానాన్ని పాటించాలని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. మైండ్ వాల్ట్ పాఠశాల నిర్మాణం, అనుమతులు, ఫీజుల విషయంలో సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ఆయన కోరారు.

- Advertisement -