తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ సాధనలో అధికార వికేంద్రీకరణ ఒక ప్రధాన ఆశయమని, ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకురావాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు చేపట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశామని తెలిపారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో దశాబ్దాలుగా ఉన్న ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని, జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు గతంలో 100–150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మారిందని అన్నారు. జిల్లాల స్థాయిలో మౌలిక వసతులు, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య, విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.
అక్టోబర్ 10, 11న కార్యక్రమాలు
* ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలి.
* జిల్లాల కోసం ఉద్యమించిన జేఏసీలు, ఉద్యమకారులను సన్మానించాలి.
* బార్ అసోసియేషన్లు, జర్నలిస్టులు, ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి.
* ప్రతి జిల్లా గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకురావాలి.
* “అప్పుడు – ఇప్పుడు” విధానంలో జిల్లాల్లో వచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలి.
* ప్రతి జిల్లా తన ప్రత్యేక విజయగాథలను ప్రజలకు తెలియజేయాలి.
* స్థానిక మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలి.
జిల్లాల ఏర్పాటు కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాదని, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులను ప్రజలకు చేరువ చేసే ప్రక్రియలో భాగమని కేటీఆర్ అన్నారు.
“మనం అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్రం శాశ్వతం.. జిల్లాలు శాశ్వతం. తెలంగాణలో అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సంస్కరణల ద్వారా జరిగిన మార్పులను ప్రజలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది” అని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
Also Read:‘ఇట్లు అర్జున’..కొత్త లవ్ స్టోరీ!
అక్టోబర్ 10, 11 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే జిల్లా దశాబ్ది వేడుకలుగా చేపట్టాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

