పాక్‌ ఉగ్రవాదంపై ఐరాసలో భారత్

3
- Advertisement -

ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్‌ ఇప్పుడు అదే ఉగ్రవాదం బారిన పడుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత్ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలపై ప్రపంచ సమాజం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

ఐరాస జనరల్ అసెంబ్లీ ఆరో కమిటీ సమావేశంలో పాకిస్థాన్‌ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు భారత్ తరఫున రైట్ ఆఫ్ రిప్లై ఇచ్చిన ఫస్ట్ సెక్రటరీ రఘు పూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న దేశంగా, బాధిత దేశంగా పాకిస్థాన్‌ తనను తాను చూపించుకుంటోందని.. అయితే తానే తయారు చేసిన ఉగ్రవాద శక్తులపై ఇప్పుడు నియంత్రణ కోల్పోయిందని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌ తయారు చేసిన, ఆ తర్వాత నియంత్రణ కోల్పోయిన ఉగ్రవాదం గతంలో పొరుగు దేశాల్లో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు అదే ఉగ్రవాదం పాకిస్థాన్‌లోనే హింసకు కారణమవుతోంది అని పూరి పేర్కొన్నారు. పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. పొరుగు దేశాల కంటే పక్కనే ఉన్న పాకిస్థాన్‌ ప్రావిన్సుల నుంచే పంజాబ్‌కు ఎక్కువ ముప్పు ఉందని ఆమె పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. అలాగే 2018లో మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాద సంస్థలను ‘నాన్-స్టేట్ యాక్టర్స్’గా పిలిచి బాధ్యత నుంచి తప్పించుకోలేరని అన్నారు.

ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించిందన్న ప్రచారాన్ని కూడా పూరి ఖండించారు. ‘‘బాంబులతో ధ్వంసమైన వైమానిక స్థావరాలు, దెబ్బతిన్న రన్‌వేలు పాకిస్థాన్‌కు విజయంగా కనిపిస్తే.. ఆ విజయాన్ని వారు ఆస్వాదించవచ్చు’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.ఆపరేషన్ సింధూర్ ఫలితాలపై పాకిస్థాన్‌ సైనిక కథనాన్ని నిజమని చూపించే ప్రయత్నం.. ఆ దేశం చాలాకాలంగా కొనసాగిస్తున్న తప్పుడు ప్రచారంలో భాగమేనని ఆయన ఆరోపించారు.

మైనారిటీల హక్కులపై పాకిస్థాన్‌ చేస్తున్న వ్యాఖ్యలను కూడా భారత్ తప్పుబట్టింది. పహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో మరణించిన బాధితులను వారి రాజకీయ అభిప్రాయాల గురించి అడగలేదని, వారి మతం గురించి ప్రశ్నించారని పూరి అన్నారు.మత విద్వేషాన్ని అరికట్టాలని మాట్లాడుతున్న పాకిస్థాన్‌.. అదే సమయంలో సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పరిస్థితులకు అవకాశం కల్పించడం విరుద్ధమని పేర్కొన్నారు.

Also Read:UPI MDR వాయిదా..పేటీఎంషేర్ల పతనం

ఉగ్రవాద సంస్థలకు ప్రభుత్వ స్థాయిలో రక్షణ లభిస్తే అంతర్జాతీయ హామీలకు విలువ ఉండదని పూరి హెచ్చరించారు. ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతాలు కల్పిస్తే బాధితులకు న్యాయం దక్కదని పేర్కొన్నారు.9/11 దాడులకు ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో పాకిస్థాన్ మిలటరీ అకాడమీకి సమీపంలోని నివాసంలో పట్టుబడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ప్రపంచం 26/11ను మరచిపోలేదు. 2008లో ముంబైలో 166 మంది ప్రాణాలను పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు బలిగొన్నారు. పహల్గాంను కూడా ప్రపంచం మరచిపోలేదు అని పూరి అన్నారు.

- Advertisement -