తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సిగ్మా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించడం లేదు. సినిమా విడుదలై ఐదు రోజులు పూర్తయినా కలెక్షన్లలో చెప్పుకోదగ్గ వృద్ధి కనిపించలేదు. సాక్‌నిల్క్ ప్రకారం.. ఐదో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.0.79 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
దీంతో ఇప్పటివరకు ‘సిగ్మా’ ఇండియా నెట్ కలెక్షన్లు రూ.6.98 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో సినిమా ఇండియా గ్రాస్ వసూళ్లు రూ.7.93 కోట్లుగా నమోదయ్యాయి. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.2.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత శనివారం రూ.1.50 కోట్లు, ఆదివారం కూడా రూ.1.50 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
Also Read:RBI:రెపో రేటు 5.50 శాతానికి పెంపు
‘సిగ్మా’ విడుదలైన రోజున జాసన్ సంజయ్‌కు ఆయన తండ్రి విజయ్ ప్రత్యేకంగా మద్దతు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోలో విజయ్.. ‘సిగ్మా’ నుంచి తన కుమారుడు జాసన్ ఫొటోను ఫ్రేమ్ చేయించిన చిత్రాన్ని అభిమానులకు చూపించారు. పార్టీ కార్యకర్త ఒకరు ఆ ఫొటోను విజయ్‌కు అందించగా.. ఆయన దానిని పైకెత్తి అక్కడున్న ప్రజలకు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘సిగ్మా’లో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించారు. సంపత్ రాజ్, రాజు సుందరం, శివ్ పండిట్, అంబు థాసన్, యోగ్ జపి, మగాలక్ష్మి సుదర్శనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

